ప్రతీ గడపకూ ప్రభుత్వ పథకాలు అందిస్తాం


Ens Balu
4
Salur
2022-08-30 09:02:01

సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో  మంగళవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర  పాల్గొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల, మహిళల, రైతుల పక్షపాతి ప్రభుత్వం అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. అర్హత ఉంటే పథకాలు గడప వద్దకే వస్తాయని  ఆయన పేర్కొన్నారు. ప్రతి గడపకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.  ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలను వివరిస్తూ కర పత్రాలను ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అందజేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. పేదల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు ఆదుకుంటుందని, పేదలందరికీ ఇల్లు అందించాలనే సంకల్పంతో రాష్ట్రంలో  లక్షల ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన వివరించారు.

 ప్రతి ఒక్కరూ గృహాలను నిర్మించుకొని సొంత ఇంటి యజమాని కావాలని ఆయన తెలిపారు.  పేదలు విద్యకు దూరం కాకూడదు అని అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలను ప్రవేశ పెట్టి ఎంత మంది పిల్లలు ఉన్నా వారందరికీ ఈ కార్యక్రమాలను అందించడం జరుగుతుందని అన్నారు. ఉన్నత చదువులు చదివే వారికి విద్యా దీవెన క్రింద పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించడం జరుగుతుందని, విద్యార్థుల వసతి కొరకు ఏడాదికి 20 వేల రూపాయల వరకు అందిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగన్ పరిపాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. 

     గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రోజు రోజుకు నిత్య నూతనంగా సాగుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటూ తమకు అందినవి, కావలసినవి తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు