గణేష్‌ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు


Ens Balu
9
Kakinada
2022-08-30 10:16:34

గణేష్‌ నిమజ్జనోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నా మని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు చెప్పారు. మంగళవారం ఆయన కాకినాడలోని జగన్నాథపురం వంతెన సమీపంలోని వినాయకసాగర్‌ వద్ద పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏడీసీ నాగనరసింహారావు మాట్లాడుతూ గడచిన రెండేళ్ళుగా కరోనా వల్ల నిమజ్జనాలు తక్కువగా జరిగాయని, ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో జరిగే అవకాశం ఉన్నందున జగన్నాథపురం వినాయక సాగర్‌తోపాటు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో రెండవ ప్రాంతంలో కూడా ఏర్పాట్లుచేస్తున్నామన్నారు. కలెక్టర్‌ కృతికాశుక్లా ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ తరుపున నిమజ్జన ప్రాంతాల వద్ద క్రేన్‌ల ఏర్పాటు, బారీకేడ్లు, టెంట్లు,నీటి సరఫరా, మైక్‌సెట్లు, రాత్రి సమయంలో ప్లడ్‌లైట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెవెన్యూశాఖ తరుపున వీఆర్వోలను ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తామన్నారు.

 వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో కీలకమైన పోలీసుశాఖ తరుపున విస్తృత బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు చెప్పారు. మత్స్యశాఖ తరుపున గజ ఈతగాళ్ళను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని ఏడీసీ నాగనరసింహారావు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎం హెచ్ ఓ డాక్టర్ పృద్విచరణ్, తాసిల్దార్  వై హెచ్ ఎస్ సతీష్, వన్ టౌన్ సిఐ రజనీ కుమార్  తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు