సెప్టెంబర్5 నాటికి ప్లాంటేషన్ పూర్తిచేయాలి


Ens Balu
8
Burja
2022-08-30 10:21:24

శ్రీకాకుళం జిల్లాలో సెప్టెంబర్ 5వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ప్లాంటేషన్ పనులు పూర్తి చేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జివి చిట్టి రాజు సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం బూర్జ మండలంలోని వైకుంటపురం వద్ద ఎవెన్యూ ప్లాంటేషన్ పనుల్లో భాగంగా పెంచిన మొక్కలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రహదారులకు ఇరువైపులా మొక్కల పెంపకం పనులు పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. జిల్లాలో వ్యక్తిగత తోటల పెంపకం పనులు 692 ఎకరాల్లో చేపడుతున్నామని అన్నారు. రహదారులకు ఇరువైపులా 46.75 కిలోమీటర్ల ఈ ఏడాది మొక్కల పెంపకం పనులు చేపట్టనున్నామని, అదేవిధంగా బ్లాక్ ప్లాంటేషన్ పనుల్లో భాగంగా 16,815 మొక్కలు పెంపకం పనులు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

 47 ఎకరాల్లో మునగ తోటల పెంపకం పనులు కూడా చేపట్టనున్నామన్నారు. 234 ఎకరాల విస్తీర్ణంలో చెరువుగట్లపై మొక్కలు పెంచనున్నామన్నారు. మొక్కల లభ్యత తక్కువగా ఉందని, ఇతర ప్రాంతాల నుండి రప్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో పీడీ వెంట గ్రామ సర్పంచ్ బొడ్డేపల్లి వెంకట సత్యనారాయణ, ఏపీవో రాజ్ కుమార్, ఈసీ గోపికృష్ణ, టెక్నికల్ అసిస్టెంట్లు రామకృష్ణ, సత్యనారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఇతర ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు