ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా నేరుగా తనను కలవొచ్చునని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. కాకినాడ 12వ డివిజన్‌లోని పర్లోపేట, స్వప్నిల్‌దినకర్ పుండ్కర్ కాలనీల్లో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. మేయర్ సుంకర శివప్రసన్న, కౌడ ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కార్పొరేటర్లు, అధికారులు ఇంటింటికి వెళ్ళి మూడేళ్ళ పాలనో ప్రభుత్వం అందించిన లబ్ధిని ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా పరిష్కరించగలమన్న ధైర్యం జగన్ ప్రభుత్వంలో ఉంటుందన్నారు. అందువల్లే ప్రజల్లోకి వెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామన్నారు.
ఇలాంటి ప్రభుత్వంలో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుపై ప్రజల్లో పూర్తి సంతృప్తి కనిపిస్తోందని, గడపగడపలో ప్రజల నుంచి వస్తున్న స్పందనే ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్‌కుమార్, నగరపాలక సంస్థ కార్యదర్శి ఏసుబాబు, కార్పొరేటర్లు రాగిరెడ్డి బన్ని, నల్లబెల్లి సుజాత, గోడి సత్యవతి, సంగాని నందం, కర్రి శైలజ, లంకే హేమలత, వైఎస్సార్‌సీపీ నాయకులు సుంకర విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.