కళాశాల సమస్యల పరిష్కారానికి చర్యలు


Ens Balu
10
Paderu
2022-09-02 16:30:54

అరకు వ్యాలీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విద్యార్థులకు స్పష్టం చేశారు.  శుక్రవారం ఎస్ఎఫ్ఐ, ఆదివాసి జెఎసి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన విద్యార్థులతో కలెక్టర్  మాట్లాడుతూ, కళాశాలలో విద్యార్థుల సౌకర్యాలను త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయం తదితర మౌలిక సదుపాయాల కల్పనకు వెంటనే రూ.17 లక్షలు మంజూరు చేస్తున్నామని తెలిపారు.  అదేవిధంగా విద్యార్థినుల రక్షణ కొరకు కాలేజీ ఆవరణ చుట్టూ నాడు నేడు క్రింద 25 లక్షల రూపాయలతో రక్షిత గోడను నిర్మిస్తామన్నారు.  ఉపాధ్యాయుల నియామకం గురించి  మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని, అంతటితో ఆగకుండా ఫాలోఅప్ చేస్తామని స్పష్టం చేశారు.

  అంతేకాకుండా విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు తో మాట్లాడి రాజమండ్రి, ఇతర ప్రాంతాల నుండి  ఉపాధ్యాయులను డెప్యుటేషన్ పై  నియమిస్తామన్నారు.  నియామక విషయమై సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో, ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి శాస్వత నియామకానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు అడిగిన పలు ప్రశ్నలకు కలెక్టర్ ఓపికగా సమాధానాలు చెప్పారు.  విద్య పట్ల, విద్యార్థుల పట్ల, సదభిప్రాయం ఉన్నందునే ఎన్నో ప్రాధాన్యతలను వదిలి, జిల్లా నలుమూలల నుండి ఈరోజు జరిగే స్పందనకు వచ్చే ఫిర్యాదుదారులను వదిలి కేవలం విద్యార్థినిలు, వారి సమస్యలు  పరిష్కరించాలని వారికి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు అరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను స్థానిక శాసనసభ్యులు శెట్టి  ఫాల్గుణ సందర్శించడం జరిగింది అని వారికి స్పష్టం చేశారు.  


సమస్యల పరిష్కారానికి కొంత సమయం పడుతుందని, తదుపరి నెలలో మళ్లీ కళాశాలను సందర్శిస్తానని, విద్యార్థినులు కూడా అయిదారుగురు  తదుపరి వారం లోగా కలిసి జరిగిన ప్రగతిని వివరించాలని కలెక్టర్ సూచించారు.  అరకు ఎంపీ, ఎమ్మెల్యేల నిధుల నుంచి కూడా 10 లక్షల రూపాయల వరకూ కళాశాల అభివృద్ధికి ఖర్చు చేయటానికి ఎంపీ, ఎమ్మెల్యే ముందుకు వచ్చారని కలెక్టర్ తెలిపారు.  దీంతో విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు, రాష్ట్ర ఆదివాసి జేఏసీ ప్రతినిధులు రామారావు దొర, ఎం. రాంబాబు, ఎస్. గంగరాజు, బి మాధవరావు, మహేశ్వర రావు, ఎస్ ఎఫ్ ఐ ప్రతినిధులు ప్రభుదాస్, ధనలక్ష్మి, కిన్నేరి, జ్యోతి, జెడ్ పి టి సి డి గంగరాజు  తదితరులు పాల్గొన్నారు. 
సిఫార్సు