రాష్ట్ర బీసీ సంక్షేమం; సమాచార, పౌర సంబంధాలు; సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆదివారం రామచంద్రపురం నియోజకవర్గం, కాజులూరు మండలం, గొల్లపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను గడప గడపకూ వెళ్లి చెబుతూ.. వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, వైఎస్సార్ పెన్షన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా తదితర పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి ఎంత మేలు జరిగిందనే విషయాన్ని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఎక్కడా రూపాయి అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పథకాల అమలు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాలు; వాలంటీర్ వ్యవస్థల ద్వారా ఇంటి వద్దకే పథకాల ఫలాలు అందుతున్నాయన్నారు. పథకాల ప్రయోజనం పొందేందుకు ఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని.. అర్హత ఒక్కటే ప్రాతిపదికగా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. ప్రజలు పేదరికమనే శాపం నుంచి విముక్తి పొందేందుకు, జీవన ప్రమాణాలను మెరుగుపరచుకునేందుకు ఈ పథకాలు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్ చేయూత, ఆసరా తదితర పథకాలను ఉపయోగించుకుంటూ మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని సద్వినియోగం చేసుకుని నేతన్నలు తమ కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. నవరత్నాలు పథకాల ద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల అభ్యున్నతికి కృషిచేస్తున్నట్లు తెలిపారు.

ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ పథకాల వివరాలు తెలియజేయడంతో పాటు సమస్యలు ఏవైనా ఉంటే తెలుసుకొని తక్షణమే పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఒక్కో సచివాలయం పరిధిలో తక్షణం చేపట్టాల్సిన పనులకు రూ. 20 లక్షలు చొప్పున ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఆసరాతో గొల్లపాలెం గ్రామం మరింతగా అభివృద్ధి సాధించాలని మంత్రి వేణుగోపాలకృష్ణ ఆకాంక్షించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.