విశ్వవిఖ్యాతగా జ్ఞాన మహర్షిగా భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రసిద్ధి గాంచారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోమవారం పట్టణంలో గల సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికులుగా ఉపాధ్యాయ సమాజం నిలిచిందన్నారు. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడుగా విద్యా బుద్ధులు నేర్పే గురువుకి ఏ ఒక్కరూ సాటిరారని కొనియాడారు.భారతీయ సమాజంలో అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువుదేనన్నారు.అందుకే పెద్దలు మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ అన్నారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన భారతదేశ రెండో రాష్ట్రపతి,మేధావి,విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధకృష్ణ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించిందన్నారు. ప్రతి యేటా సెప్టెంబర్ 5న గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించిందన్నారు.ఈ నేపథ్యంలో గురువు గొప్పదనం, ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టత తెలుసుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు.అజ్ఞాన పొరలు తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగించే గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనదన్నారు.సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారన్నారు. హృదయాన్ని, మేధను సమపాళ్లలో పండించిన ప్రజ్ఞాశాలిగా, తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహా రచయిత రాధాకృష్ణన్ సేవలు చరిత్రలో నిలిచాయన్నారు.
ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో,గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయచరిత్రలో స్పష్టంగా వివరించారన్నారు. రాధాకృష్ణన్ ను స్ఫూర్తిగా తీసుకొని,, నేటి పిల్లలను పావన నవజీవన బృందావన నిర్మాతలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయ సమాజంపై ఉందన్నారు..విధ్యా బోధనలో కొనసాగుతున్న ఉపాధ్యాయ, అధ్యాపక,ఆచార్యులకు..విద్యా సంస్థల నిర్వహణలో ముఖ్య భూమిక వహిస్తున్న ప్రధానోపాధ్యాయులకు,ప్రిన్సిపాల్స్ కు స్పీకర్ తమ్మినేని సీతారాం ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, బొడ్డేపల్లి రమేష్ కుమార్, దుంపల శ్యామలరావు పొడుగు శ్రీను, బోడ్డేపల్లి రమణమూర్తి, మామిడి రమేష్, కుసుమంచి శ్యాంప్రసాద్, బొర చిన్నం నాయుడు,చిన్నారావు, మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.