శిక్ష అనేది సంఘటన తర్వాత జరిగే ప్రక్రియని, కానీ నేరాలు జరగకుండా ఉండాలంటే అందరూ నైతిక ప్రవర్తనతో, క్రమశిక్షణతో మెలగాలని న్యాయవాది యనముల రామం పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయవిద్యాన సదస్సు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సెల్ఫోన్లో లభిస్తున్న అశ్లీల సాహిత్యం, పెరుగుతున్న పాశ్చాత్య సంస్కృతి, వేష భాషలలో గణనీయమైన మార్పు, పబ్ కల్చర్, క్షీణిస్తున్న కుటుంబ విలువలు మహిళలపై అత్యాచారాలు పెరగడానికి ముఖ్య కారణాలన్నారు. లైంగిక వేధింపులను నిరోధించడానికి గాను న్యాయస్థానాలు పాస్ట ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి కేసులపై త్వరితంగా విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించనుందని యనమల తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, స్థానికులు పాల్గొన్నారు.