రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సూచించాలని, వ్యవసాయాధికారులను జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. సాగునీటి ఎద్దడి నెలకొన్ని ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. సాగునీటి కాలువలను, చెరువులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. వరిపంటకు బదులు అపరాలను సాగుచేయాలని సూచించారు. గుర్ల, గరివిడి మండలాల్లో కలెక్టర్ సూర్యకుమారి మంగళవారం విస్తృతంగా పర్యటించారు. గుర్ల మండలం గూడెం వద్దనున్న తోటపల్లి డిస్ట్రిబ్యూషన్ కెనాల్‌ను కలెక్టర్ ముందుగా పరిశీలించారు. ఈ కెనాల్ ద్వారా సుమారు 6వేల ఎకరాలకు నీరు అందుతుందని, కెనాల్‌లో పూడికలు, పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగిపోయిన కారణంగా నీరు వెళ్లే పరిస్థితి లేదని, తోటపల్లి ఇఇ రామచంద్రరావు వివరించారు. అనంతరం పెనుబర్తి వద్ద తోటపల్లి ప్రదాన కుడి కాలువను కలెక్టర్ సందర్శించారు.
ఈ కాలువలో 96.5 కిలోమీటర్లు వరకు మాత్రమే నీరు వచ్చిందని, పూడికలు, పిచ్చిమొక్కల కారణంగా దిగువకు నీరు రావడం లేదని ఇఇ తెలిపారు. కాలువల నిర్వహణకు దాదాపు 8 ఏళ్లుగా నిధులు రావడం లేదని, లష్కర్లు కూడా మంజూరు కాలేదని తెలిపారు. ఫలితంగా గుర్ల, గరివిడి, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాలకు పూర్తిగా, చీపురుపల్లి మండలానికి పాక్షికంగా సాగునీటి కొరత ఏర్పడిందని ఇఇ వివరించారు. గరివిడి మండలం శేరిపేట గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. ముందుగా గ్రామంవద్ద తోటపల్లి కాలువపై నిర్మించిన సైపూన్‌ను పరిశీలించారు. అనంతరం పంటపొలాలను వీక్షించారు. రైతులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. తోటపల్లి కాలువ నుంచి నీరు రాకపోవడంతో, గ్రామంలో ఉబాలు జరగలేదని, నారు ఎండిపోతోందని రైతులు చెప్పారు. కాలువలను బాగుచేయించి, వచ్చే ఏడాదికైనా కాలువల ద్వారా సాగునీరు వచ్చేలా చూడాలని రైతులు కోరారు. తమకు సబ్సిడీపై పెసలు, మినప విత్తనాలను సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో గుర్ల తాశీల్దార్ పద్మావతి, ఎంపిడిఓ బి.కల్యాణి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.