తోటపల్లి ప్రాజెక్టు పైన తగినంత వర్షపాతం లేదని, అందువల్ల సాగునీటికి ఇబ్బంది ఏర్పడిందని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి చెప్పారు. మంగళవారం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను కలెక్టర్ స్వయంగా సందర్శించి అక్కడి పరిస్థితి సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఈ సమస్యను ప్రభుత్వానికి నివేదించడంతోపాటు, ఉపాధిహామీ పథకం ద్వారా కాలువల నిర్వహణకు ప్రయత్నం చేస్తామని, వచ్చే ఏడాది నాటికి ఈ సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వర్షాల కోసం ఎదురు చూడకుండా, వరికి బదులు అపరాలు లాంటి తక్కువ నీటి అవసరం గల, ప్రత్యామ్నయ పంటల సాగును చేపట్టాలని సూచించారు. రైతుల విజ్ఞప్తి మేరకు మినప, నల్ల పెసర విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలని, జిల్లా వ్యవసాయాధికారి తారకరామారావును, ఏఓ సంగీతను ఆదేశించారు. నీటి ఎద్దడి నెలకొన్ని ప్రాంతాలను తక్షణమే సర్వే చేసి, అవసరమైన విత్తనాలను రైతులకు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో గుర్ల తాశీల్దార్ పద్మావతి, ఎంపిడిఓ బి.కల్యాణి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.