విజయనగరం జిల్లా గుర్ల మండలం కెల్ల రైతు భరోసా కేంద్రాన్ని, గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మంగళవాం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి, గ్రామంలోని పంటల పరిస్థితిని తెలుసుకున్నారు. ఎరువుల సరఫరా, లభ్యతపై ఆరా తీశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా, సరిపడిన ఎరువులను సిద్దంగా ఉంచాలని ఆదేశించారు. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించి, దాని వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. గ్రామంలో ఇ-క్రాప్ నమోదు, పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్, ఇకెవైసి, భూముల రీసర్వే, ప్రకృతి సేద్యంపై ఆరా తీశారు. పశువ్యాధులపై ప్రశ్నించారు. వ్యాధులు ప్రభలకుండా తగిన ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. నవంబరు నాటికి రైతుభరోసా కేంద్రం భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో గుర్ల తాశీల్దార్ పద్మావతి, ఎంపిడిఓ బి.కల్యాణి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.