విజయనగరం జిల్లా కెల్ల జిల్లాపరిషత్ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మంగళవారం కలెక్టర్ సూర్యకుమారి తనిఖీ చేశారు. ఆహార పదార్ధాలను స్వయంగా ఆమె రుచి చూశారు. మెనూ, పిల్లల సంఖ్యపై ప్రశ్నించారు. కిచెన్‌షెడ్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం పదో తరగతికి వెళ్లి, విద్యార్థులతో మాట్లాడారు. వారిచేత పాఠాలను చదివించి, పరీక్షించారు. బాలికలందరినీ సఖి గ్రూపుల్లో చేర్చాలని సూచించారు. విద్యార్థులకు చదువుతోపాటు, కెరీర్ గైడెన్స్ నిర్వహించాలని, వారు లక్ష్యాన్ని సాధించే మార్గాలను సూచించాలని, హెడ్‌మాష్టర్ పైడితల్లిని ఆదేశించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ తమ తరగతి గదుల్లోకి వచ్చి పాఠ్యాంశాలు బోధించడం, తమను సమస్యలు అడిగి తెలుసుకోవడం పట్ల విద్యార్ధులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో గుర్ల తాశీల్దార్ పద్మావతి, ఎంపిడిఓ బి.కల్యాణి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.