రైతులు ఇ క్రాప్ లో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కోరారు. మంగళవారం సాలూరు మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ నమోదు పరిస్థితిని స్వయంగా పంట పొలాల్లోకి వెళ్లి తెలుసుకున్నారు. ఇ క్రాప్ నమోదులో పరిస్థితులను పరిశీలించారు. స్థానిక అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇ క్రాప్ నమోదుకు బుధవారం వరకే గడువు ఉండటంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 12,500 మంది తక్షణం ఇ క్రాప్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని వారందరికీ రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సహాయ సహకారాలు అందించి నమోదు అయ్యేటట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ఇ క్రాప్ నమోదు కాకపోతే ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయ కార్యక్రమాలు నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రయోజనాలు కోల్పోకుండా తక్షణం ప్రతి రైతు ముందుకు వచ్చి తమ పంటలను ఇ క్రాప్ నమోదు చేసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందాలని సూచించారు. ఆసుపత్రి భవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ భవన నిర్మాణాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాలను మరింత వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. వైద్య సిబ్బంది నియామకాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, త్వరలో సిబ్బంది నియమాకునికి అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. మందులు అన్ని ఉండాలని, ప్రతి ఇంట జరుగుతున్న సిడి, ఎన్సిడి సర్వేలో భాగంగా రక్త నమూనాలను సేకరించి పరీక్షించాలని ఆయన చెప్పారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిశుభ్రంగా ఉండి వచ్చే పేషెంట్లకు ఆహ్లాదాన్ని ఇవ్వాలని తెలిపారు.
ఆసుపత్రికి వచ్చిన వెంటనే తగ్గిపోతుందనే విశ్వాసాన్ని వారికి కల్పించాలని చెప్పారు. వైద్యులు, సిబ్బంది ప్రేమ పూర్వకంగా పలకరించి వారికి సేవలందించడం వలన త్వరగా ఉపశమనం పొంది తిరుగు ముఖం పట్టగలరని కలెక్టర్ ఉద్భోదించారు. ఆసుపత్రికి వైద్యానికి వచ్చే వారికి సరైనటువంటి మార్గదర్శకం అందించాలని పేర్కొన్నారు. గర్భిణీలు పట్ల మరింత శ్రద్ధ వహించాలని ఆయన ఆదేశించారు.108 వాహనాల్లో ప్రసవాలు జరగరాదని, గర్భిణీలు ముందుగా ఆసుపత్రికి వచ్చే విధంగా ఆరోగ్య సిబ్బంది చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ భవనాలు - రైతు భరోసా కేంద్రం , వైయస్సార్ హెల్త్ క్లినిక్, సచివాలయం నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ స్థాయిల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాలూరు తాసిల్దార్ రామస్వామి, ఎంపీడీవో, వ్యవసాయ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.