ఉజ్వల పధకం పంపిణీ చేస్తున్న గ్యాస్ కనెక్షన్లను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా, శంఖవరంలోని సింధు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ ఎంపీ వంగా గీత పాల్గొని లబ్దిదారులైన మహిళలను గ్యాస్ స్టవ్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మహిళల ఆరోగ్య భద్రతకే కేంద్ర ప్రభుత్వం ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేస్తోందని ఆమె వివరించారు.
ప్రస్తుతం ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీలో శంఖవరం మండలంనకు 259 దరఖాస్తులు రాగా వీటిలో 155 మందికి పంపిణీ చేస్తున్నారని, ఇంకా 104 కురదలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ పధకం కనెక్షన్లను అమ్ముకోవద్దనీ, అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె లబ్దిదారులను కోరారు.
శంఖవరం పంచాయతీ ఉపసర్పంచ్ చింతం నీడి కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు కొన్ని గ్యాస్ కనెక్షన్లను లాంఛనంగా పంపిణీ చేస్తున్నారని, మిగతావన్నీ గ్రామాల వారీగా పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించే ఈ సౌకర్యాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శంఖవరం మండల పరిషత్తు అధ్యక్షుడు, శంఖవరం ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ది సంఘం అధ్యక్షుడు పర్వత రాజబాబు, శంఖవరం ఎంపీటీసీ సభ్యులు గెడ్డం రాణీ, అడపా వీరబాబు, అన్నవరం ఎస్సైలు శోభన్ కుమార్, అజయ్ బాబు, గ్రామస్థులు పాల్గొన్నారు.