వయసు పెరిగే కొద్దీ కంటి చూపు, వినికిడి శక్తి తగ్గడం సహజమని అలాగే అల్జీమర్స్ కూడా అని అయితే దీనిని ప్రారంభ దశలో గుర్తిస్తే మందులతో నియంత్రించవచ్చని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడలోని రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలోని అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పరిచయస్తులు ఎదురుగా ఉన్నప్పటికీ వారిని గుర్తించకపోవడం, పేర్లు మరిచిపోవడం ,వెళ్ళవలసిన సమయం మరచి పోవడం, అధిక ఆత్రుత, భయం అల్జీమర్స్ లక్షణాలని అన్నారు. ప్రస్తుత సమయం, తేదీ, రోజులను మరిచిపోవడమే గాక ఇంటి చిరునామా కూడా మరిచిపోతారని అన్నారు. సాధారణ రక్ష పరీక్ష ద్వారా వీటి మోతాదును తెలుసుకొని మందులతో పూర్తిగా నయం చేయవచ్చని అన్నారు. అల్జీమర్స్ కు గురైన వ్యక్తిని ఒంటరిగా బయటకు పంపరాదని అన్నారు .రోగికి ప్రశాంత వాతావరణం కల్పించాలని, సమతుల ఆహారం అందించాలని డాక్టర్ కుమార్ యాదవ్ తెలిపారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ ,రాఘవరావు, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.