సామాజిక చైతన్య జాడ గురజాడ


Ens Balu
39
Srikakulam
2022-09-21 09:36:00

సామాజిక చైతన్యానికి బాటలు వేసిన మహనీయులు గురజాడ అప్పారావు అని రాజీవ్ విద్యామిషన్ పిఒ రోణంకి జయప్రకాష్ కొనియాడారు.  శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనంలో గురజాడ 160వ జయంతి వేడుకలు గురజాడ అధ్యయన వేదిక కన్వీనర్ జామి భీమశంకర్, అధ్యక్షులు పత్తి సుమతి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జయప్రకాష్ మాట్లాడుతూ, దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అంటూ నినదించిన ఆధునిక వైతాళికుడు గురజాడ అన్నారు.  అనంతరం పిఒ మాట్లాడుతూ సమాజంలోని సాంఘిక దురాచారాలపై ధ్వజమెత్తి తన అక్షరాలనే శస్త్రాలుగా చేసి ప్రశ్నించిన అభ్యుదయ కవి గురజాడ అన్నారన్నారు. 

సొంతలాభం కొంతమానుకొని పొరుగువారికి తోడ్పడాలంటూ ప్రతి ఒక్కరిలో సామాజిక బాధ్యతను పెంపొందించాలని చెప్పారన్నారు. గురజాడ సృష్టించిన అక్షర అణిముత్యాలు కన్యాశుల్యం నేటికీ సాహితీవనంలో ఆచంద్రతారారక్కం వెలుగొందుతోందని రోణంకి జయప్రకాష్ చెప్పారు. రాజీవ్ విద్యామిషన్ పరిధిలో ఉన్న కస్తూరిబా విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనాన్ని సందర్శింపచేసి స్ఫూర్తి పొందేలా తన వంతు సహకరిస్తాననన్నారు. గురజాడ అధ్యయన వేదిక కన్వీనర్ జామి భీమశంకర్, అధ్యక్షురాలు పత్తి సుమతి మాట్లాడుతూ గడిచిన పదేళ్లుగా మహాకవి గురజాడ భావజాలాన్ని భావితరాల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేస్తున్నామన్నారు.

 పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, కన్యాశుల్కంతో పాటు నాటి సమాజంలో ఉన్న దురాగతాలపై సాహిత్యపు అంకుశాలను వదిలిన గురజాడ ఎప్పటికీ సజీవమే అన్నారు. గురజాడ జయంతి సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు పీవో రోణంకి జయప్రకాష్  బహుమతులు అందజేశారు. అనంతరం గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు ఎం.ప్రసాదరావు, సురంగి మోహన్ రావు, బరాటం లక్ష్మణరావు, వావిలపల్లి జగన్నాథంనాయుడు, హారికాప్రసాద్, పొన్నాడ రవికుమార్, నిక్కు అప్పన్న, కొంక్యాన వేణుగోపాల్, నక్క శంకరరావు, పందిరి అప్పారావు, తర్జాడ అప్పలనాయుడు బృందం పీవోను శాలువ, మెమెంటో ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యాధరి డిగ్రీ కళాశాల అధ్యాపకులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకురాలు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు