మండలంలో 2 పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి..
Ens Balu
2
Paderu
2020-09-21 20:36:17
విశాఖ ఏజెన్సీలో ఇంజనీర్లు వినూత్నంగా ఆలోచించి మనబడి నాడు నేడు లో మండలానికి రెండు పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని పాడేరు ఐటిడిఏ పీఓ డా. వెంకటేశ్వర్ సలిజామల ఆదేశించారు. సోమవారం రెవెన్యూ, గిరిజన సంక్షేమశాఖ,పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఎం.పి.డి. ఓలు, ఉపాధిహామీ, వెలుగు అధికారులతో వారాంతపు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మనబడి నాడు నేడు పనులు నత్తనడకన జరుగుతున్నా యని పనులు వేగం పెంచాలని ఆదేశించారు. నాడు నేడు పనులకు రివైజ్డ్ అంచనాలు వేసి మండలానికి రెండు పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేసారు. సోమవారం నాటికి నాడు నేడులో రూ.74.55 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా రూ.55 కోట్లు ఖర్చు చేసారని అన్నారు. అటవీ హక్కులపై గ్రామ సభ తీర్మానాలు త్వరగా పూర్తి చేయాలిన చెప్పారు. ఈనెల 23 వతేదీన ఆర్ ఓ ఎఫ్ పట్టాలపై సబ్ డివిజినల్ స్దాయి సమావేశం నిర్వహించి 24, లేదా 25 తేదీలలో జిల్లా స్దాయి కమిటీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈలోగా జి పి ఎస్ సర్వే పూర్తి చేసి సరిహద్దురాళ్లు నాటించే పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం అనుసంధానంతో చేపట్టిన రైతు భరోసా, గ్రామ సచివాలయ నిర్మాణాల పనులపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. సిమ్మెంటు, ఇసుక,నిర్మాణ సామగ్రి కొరతలేదని నిర్దిష్ట సమయానికి జరగవలసిన పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. 228 ప్రహరీ గోడలపనులకు 8 మాత్రమే పూర్తి చేసారని అన్నారు. మండలంలోని కమ్యూనిటీ సమన్వయ కర్తలు సామాజిక పెట్టు బడి నిధి నెలకు రూ.50 వేలు రికవరీ చేయాలని వెలుగు అధికారులకు సూచించారు. మహిళా సంఘాలను బలోపేతం చేయాలని అన్నారు. ఉపాధిహామీ పధకంపై సమీక్షిస్తూ ముంచింగ్ పుట్టు, పెదబయలు, జి.కె. వీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాలో జరిగిన ఉపాధిహామీ పనులపై సామాజిక తనిఖీలు చేయించాలని చెప్పారు. ఉపాధికూలీల సంఖ్య తగ్గిందని పెంచాలని చెప్పారు. ఎపి ఓలు ఉపాధిహామీ పనులపై ప్రత్యేక శ్రద్ద వహించి పనులు చేయాలన్నారు. కాఫీ పిట్టింగ్, ప్లాంటేషన్‌పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఆర్ డి ఓ కె. లక్ష్మి శివ జ్యోతి మాట్లాడుతూ రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వెంటనే రైస్ కార్డు లబ్దిదారులకు అందించాలని చెప్పారు. ప్రతీ డి ఆర్ డిపో వద్ద ఇద్దరు వాలంటీర్ల ను నియమించి నవశకంలో పెండింగ్‌లో ఉన్న రైస్ కార్డులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఆర్ ఓ ఎఫ్ ఆర్ రిపోర్టులలో ఉన్న వ్యత్యాసాలను సరిదిద్దాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఈ ఈ కె. వి. ఎస్ ఎన్ కుమార్, పంచాయతీ రాజ్ ఇ ఇలు ఆర్.కె. భాస్కర్, పి ఐ యు ఇ ఇ శ్రీనివాసరావు, వెలుగు ఎపిడి నాగేశ్వరరావు, ఎస్ ఎం ఐ డి ఇ రాజేశ్వరరావు, ఉపాధిహామీ ఎపిడి సి.హెచ్.లచ్చన్న ,కాఫీ ఎడి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.