నేటి ఆధునిక జీవన శైలి కారణంగా చిన్న వయసులోనే పలువురు గుండె జబ్బులకు గురవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ గుండె వ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆధునిక ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు, మధుమేహం నియంత్రణలో లేకపోవడం, అధిక రక్తపోటు వంటి కారణాల చేత గుండె జబ్బు వెంటాడుతుందన్నారు. ఆయాసం, ఛాతిలో నొప్పి, చెమట పట్టడం, అలసట, కళ్ళు తిరగడం, గుండెలో దడ ,చాతి మధ్యలో మంటగా, బిగుదుగా, బరువుగా ఉండడం గుండెజబ్బు లక్షణాలు అని అన్నారు. దీన్ని అధిగమించడం కోసం రోజు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలన్నారు. శరీర బరువును అదుపులో ఉంచాలన్నారు .ధూమపానం, మద్యపానం తగదన్నారు. యోగ, ధ్యానం వంటివి చేయాలని అన్నారు. ఆకుకూరలు, చిరుధాన్యాలను అధికంగా తీసుకోవాలని డాక్టర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.