పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన జగన్నాధపురం లోని 24, 25 డివిజన్లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఇంటింటికి చెత్త సేకరణను ఆరా తీశారు. చెత్తను నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన వేసిన ఓ షోరూం యజమాని వద్ద వెయ్యి రూపాయలు జరిమానా వసూలు చేయాలని సంబంధిత సానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. 24వ డివిజన్లో పారిశుద్ధ్య పనులలో పర్యవేక్షణ లోపాన్ని గుర్తించారు. పనితీరు మెరుగుపరచుకోకపోతే అక్కడి శానిటరీ సెక్రటరీపై చర్యలు తీసుకుంటామన్నారు. వార్డుల వారీగా అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచేందుకు సచివాలయ సిబ్బంది ప్రత్యేకంగా ద్రుష్టిసారించాలన్నారు. ఈ విషయంలో ఎలాంటి సంప్రదింపులకు తావులేదని హెచ్చరించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా సంబంధిత సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏడీసీ వెంట సానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.