విశాఖలో ఈ నెల 15వ తేదీన జరగనున్న విశాఖ గర్జనకు సంబంధించిన ఏర్పాట్లను వైఎస్సీర్సీపీ ముఖ్య నాయకులు, మంత్రులు గురువారం పరిశీలించారు. విశాఖలోని ఎల్ఐసి భవనం దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర బీచ్ రోడ్ లోని పార్క్ హోటల్ దగ్గర ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ముగుస్తుంది. సుమారు 12 గంటల ప్రాంతానికి పాదయాత్ర ఇక్కడకి చేరుకోనుంది. అనంతరం పార్టీ పెద్దలు , మంత్రులు, ముఖ్య నాయకులు ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఉమ్మడి విశాఖ జిల్లాల వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే నాగిరెడ్డి తదితరులు పరిశీలించారు.