మన శరీర అవయవాలలో కళ్ళకు ఎంతో ప్రాధాన్యత ఉందని, కంటి చూపు లేకపోతే అంతా అంధకారమేనని కానీ కంప్యూటర్లు, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్లతో పలువురు వయసు తారతమ్మత లేకుండా కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోటు క్లబ్ వాకర్స్ సంగం ఆధ్వర్యంలో ప్రపంచ దృష్టి దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వాతావరణ కాలుష్యం, ప్రమాదాలు, రసాయన పరిశ్రమలలో పనిచేసే వారికి, విటమిన్ల లోపం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటి వలన కంటి చూపు మందగిస్తుందన్నారు. వంశపారంపర్యంగా కూడా కంటిచూపు సమస్యలు ఏర్పడవచ్చు అని అన్నారు. ఈ ఏడాది ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా 'కళ్ళను ప్రేమించు' నినాద లక్ష్యమని డాక్టర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.