ఆక్వా సాగుపై స్పందన కార్యక్రమంలో అందుతున్న ఫిర్యాదులకు ఖచ్చితమైన పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జె.వి మురళి మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్ ఈ-ఫిషింగ్, లైసెన్స ల జారీ, స్పందన పిటిషన్ లపై మత్స్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆక్వాపై స్పందన కార్యక్రమంలో ఎక్కువగా పిటిషన్లు అందుతున్నాయని దీనిపై మత్స్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఫిర్యాదులకు మొక్కుబడిగా జవాబు ఇవ్వకుండా, క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిష్కారం చూపాలని ఆయన ఆదేశించారు. ఈ-ఫిషింగ్ నమోదు, లైసెన్సులు జారీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి కె.ఎస్.వి నాగలింగాచార్యులు, సహాయ సంచాలకులు ఆనందరావు, ఎల్ఎల్ఎన్ రాజు, ఎఫ్.డి.ఓలు, తదితరులు పాల్గొన్నారు.