మురికివాడల ప్రజల పట్ల కలెక్టర్ ఔదార్యం


Ens Balu
14
Tanuku
2022-10-18 10:28:23

ఎవరేమైపోతే నాకేంటి అనే ఈ రోజుల్లో.... తణుకు పట్టణంలో  పేదలకు స్థలం కేటాయింపుకు అవసరమైన భూమిని పరిశీలించేందుకు ఈ నెల అక్టోబర్ 14న వెళ్ళిన జిల్లా కలెక్టర్  పి.ప్రశాంతికి అదే త్రోవల కనిపించిన దృశ్యానికి చెలించి పోయారు. డంపింగ్ యార్డుకు ఆనుకొని అపరిశుభ్రత వాతావరణంలో గుడారాల్లో నివసిస్తున్న కుటుంబాలు జిల్లా కలెక్టర్ కంట పడ్డాయి.  వారికి బాసటగా నిలిచేందుకు ఏమేమి ఏర్పాట్లు చేయాలో ప్రయాణిస్తున్న వాహనం నుండే తహసిల్దార్ కు ఆదేశాలు జారీ చేశారు. ఆనాటి నుండి మదిలో ఉన్న ఆలోచనలకు కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టి, ఐదు రోజులు గడవకముందే ప్రత్యేక క్యాంపు ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశారు.  

మండల తహసిల్దార్ ఆధ్వర్యంలో ఉదయమే పెద్దలకు, పిల్లలకు శుభ్రంగా క్రాప్ చేయించడం జరిగింది. డంపింగ్ యార్డ్ సమీపంలో కొండాలమ్మ గుడి వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక క్యాంపుకు 18 కుటుంబాలను తీసుకువచ్చారు.  వారిలో 18 సంవత్సరాల లోపు 22 మంది పిల్లలు, 41 మంది పెద్దలు ఉన్నారు.  సచివాలయ సిబ్బందితో కంప్యూటర్లు ఏర్పాటు చేసి అక్కడే వారందరికీ ఆధార్ నమోదు చేయడంతో పాటు, వైద్య సిబ్బందిచే వైద్య పరీక్షలు చేయించి అవసరమైన వారికి మందులను కూడా పంపిణీ  చేయడం జరిగింది. ఆధార్ నమోదు అనంతరం రేషన్ కార్డులు జారీకి జాబితాను సిద్ధంచేసి పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్ తాసిల్దార్ ను ఆదేశించారు. అలాగే లేఔట్ లో ఖాళీగా ఉన్న  స్థలాలను వారికి కేటాయించి ఇళ్ళ నిర్మాణాలు చేపట్టాలని,  లేనిపక్షంలో 18 కుటుంబాలకు ప్రత్యేకంగా భూ సమీకరణ చేసి ఇళ్ల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 

రెడ్ క్రాస్, తహసిల్దార్, ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ, తార్పాలిన్లు, పిల్లలకు దుస్తులను అందజేయడం జరిగింది. మానవతా స్వచ్ఛంద సంస్థ ఈరోజు క్యాంపు వద్ద ఆయా కుటుంబాలకు భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది.  ఈ  చర్యలన్ని చక, చక జరిగిపోవడంతో 18 కుటుంబాలతో పాటు, అధికారులు కూడా ఒకింత ఆశ్చర్యానికి, సంతోషానికి లోనయ్యారు.  చాలా సంవత్సరాలుగా 18 కుటుంబాల వారు డంపింగ్ యార్డ్ పక్కనే నివసిస్తూ అందరూ చెత్తను ఏరుకొని, దానిని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా వారి జీవితాలలోరాని మార్పు కేవలం ఐదు రోజులు గడవక ముందే  జిల్లా కలెక్టర్ కృషితో వారి జీవితాల్లో మార్పుకు తొలి బీజం పడింది.  

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా కుటుంబాలతో మాట్లాడుతూ చదువుకోవడం ద్వారా ఎలా అభివృద్ధి చెందవచ్చో, ఎలా మంచిగా జీవించవచ్చో వారికి అర్థమయ్యే రీతిలో వివరించారు. ప్రస్తుతం చేస్తున్న పనిని మీరందరూ మానేయాలని చెబుతూ, పిల్లలను బడికి పంపించాలని వారిని కోరారు. జిల్లా కలెక్టర్ చెప్పిన మంచి మాటలకు వారు పిల్లలు చదువు కునేందుకు అంగీకరించారు.  హాస్టల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ,  సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పెద్దలకు కూడా పారిశుద్ధ్య కార్మికులుగా అవకాశం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వారికి తెలిపారు. ప్రత్యేక క్యాంపు కార్యక్రమంలో అడిషనల్ డిఎం&హెచ్ఓ బి.భాను నాయక్, ఐసిడిఎస్ పిడి శ్రీమతి బి.సుజాత రాణి, తహసిల్దార్ పి ఎన్ డి ప్రసాద్, ఎంఈఓ శ్రీనివాసు, మున్సిపల్ కార్పొరేషన్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, స్థానిక ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు