అనకాపల్లి, అచ్చుతాపురం ప్రాంతం పారిశ్రామిక నగరంగా ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రంలో నిలుస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఆదివారం ఎలమంచిలి నియోజకవర్గంలోని పూడి గ్రామంలో సుమారు 300 కోట్ల రూపాయల వ్యయంతో 15.76 ఎకరాల్లో చైనాకు చెందిన యమా రిబ్బన్స్ కంపెనీ నిర్మాణానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే స్టీల్ ప్లాంట్, హెచ్పీసీఎల్, షిప్ యార్డ్, బిహెచ్ఇఎల్ వంటి అనేక భారీ పరిశ్రమలతో పెద్ద పారిశ్రామిక నగరంగా విశాఖ వెలుగొందుతోందని, ఇదే సమయంలో అచ్యుతాపురం సెజ్ లో మరిన్ని పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయని దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారిశ్రామిక ప్రగతికి అనుగుణంగా తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని అన్నారు. 300 కోట్ల రూపాయల పెట్టుబడితో నెలకొల్పనున్న యమా రిబ్బన్స్ కంపెనీలో రెండు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని మంత్రి తెలియజేశారు. 1500 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన ఏ సిటీ టైర్ల కంపెనీ వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందని ఆయన తెలియజేశారు.
అచ్చుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి నుంచి కాకినాడ వరకు పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 25 వేల ఎకరాల పారిశ్రామిక భూమి అందుబాటులో ఉందని ఎన్ని పరిశ్రమలు వచ్చిన వాటికి భూమి కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని అన్నారు. యమ రిబన్స్ కంపెనీ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తున్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. ఈ కంపెనీలో మహిళలకు అధిక సంఖ్యలో ఉద్యోగాలు లభించనున్నాయని అని చెప్పారు. జనాభా విషయంలో చైనా, భారతదేశం దాదాపు ఒకే విధంగా ఉందని, సాంకేతిక రంగంలో కూడా ఇరుదేశాలకు చెందిన వారు ప్రపంచంలోని అనేక ముఖ్య నగరాల్లో విధులు నిర్వహిస్తున్నారని విషయాన్ని మంత్రి అమర్నాథ్ గుర్తు చేశారు. పీఎం మిత్ర స్కీమ్ ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని సమావేశానికి హాజరైన సెంట్రల్ టెక్స్టైల్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ కు అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, త్వరలోనే పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు.అనకాపల్లి ఎంపీ సత్యవతమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుంచి ఈచ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ స్థానంలో ఉందని, సింగల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్నారని చెప్పారు.
ఎమ్మెల్యే యు.వి. రమణ మూర్తి రాజు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి వచ్చే కొత్త కంపెనీలు అన్నిటికీ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పడిన ఈ సెజ్ లో అనేక కంపెనీలు వస్తున్నాయని ఆయన చెప్పారు. టెక్స్టైల్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ యమ రిబ్బన్స్ కంపెనీ 2000 మందికి ప్రత్యక్షంగాను, మరో 2000 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పించడం ఉందని ఆయన చెప్పారు. చైనా జనరల్ కాన్సులేట్ జాలియో మాట్లాడుతూ కంపెనీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కొనియాడారు. వ్యాపార, వాణిజ్య రంగాలలో భారత్, చైనా సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యమ ఇండియన్ హెడ్ స్టీవ్ , ఏపీఐఎస్సి జెడ్ ఎం త్రినాధ్, యమ రిబ్బన్స్ కంపెనీకి చెందిన ప్రజలు పాల్గొన్నారు.