మధుమేహవ్యాధిని తరిమికొట్టాలని శ్రీకాకుళం జిల్లా జిల్లావైద్యఆరోగ్య శాఖ అధికారి డా.బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. జీవనశైలిలో మార్పులు, జన్యుపరమైన అంశాలు కారణంగా మధుమేహం విస్తరిస్తోందని ఆమె పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని స్టార్ వాకర్స్ క్లబ్ మరియు లైన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేశారు. జెమ్స్ ఆసుపత్రి వర్గాలు ఉచిత వైద్యశిభిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శాసపు జోగినాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ... మధుమేహాన్ని ప్రాథమిక దశలో గుర్తించడం వల్ల కొంతవరకు వ్యాధి వ్యాప్తి జరగకుండా నివారించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారని ,రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఏటా కొన్ని కోట్లమంది మధుమేహం బారినపడి పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ ను మధుమేహ రాజధానిగా గుర్తించడం మనకు ఎంత సిగ్గుచేటన్నారు.
స్వంచ్చంద సంస్థలు, ప్రభుత్వాలతో పాటు చొరవ తీసుకొంటే పెద్దఎత్తున ఈ ప్రమాదం నుండి కాపాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. జెమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ కె. సుధీర్ మాట్లాడుతూ... మధుమేహం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజారోగ్య సమస్య అని,సరైన అవగాహన మాత్రమే ఈ వ్యాధినుండి రక్షిస్తుందని అన్నారు. ప్రతీ ఒక్కరూ ఆరోగ్య నియమాలు పాటిస్తూ, పూర్వీకులు మనకు ప్రసాదించిన ఆహారాన్ని తీసికుంటే బాగుంటుందని అన్నారు.జింకు ఫుడ్స్ కు అలవాట్లు కాకుండా పిల్లలను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మధుమేహం చిన్నారుల శారీరక ,మానసిక ఎదుగుదలకు అవరోధంగా నిలుస్తుందని అన్నారు.కోవిడ్ అనంతరం మధుమేహం పెరుగుతుందని దీని నియంత్రణకు అందరూ నడుమ కట్టి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షుడు హరికా ప్రసాద్,వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ పి.జి.గుప్తా,మాజీ వాకర్స్ గవర్నర్లు జి.ఇందిరాప్రసాద్, కూన వెంకట రమణ మూర్తి,గుడ్ల సత్యనారాయణ, ఎస్.సంజీవరావు, గోలీ సంతోష్,ఉమా, లైన్స్ క్లబ్ ప్రతినిధులు వావిలపల్లి జగన్నాధనాయుడు,నటుకుల మోహన్, పొన్నాడ రవికుమార్, బాడాన దేవభూషణ్ రావు, జెమ్స్ వైద్యులు డాక్టర్ ప్రవీణ్, ఇతర వైద్యులు, జెమ్స్ మేనేజర్ ఆబోతుల రామ్మోహన్ రావు,తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రపంచ మధుమేహం దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహనర్యాలీని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి చేతులమీదుగా ప్రారంభించారు. ఈ ర్యాలీలో ఇండియన్ ఆర్మీ విద్యార్థులు, జెమ్స్ ఆసుపత్రి నర్సింగ్ విద్యార్థులు, క్రీడాకారులు, వాకర్స్,లైన్స్ క్లబ్ సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించి నినాదాలు చేశారు.