రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యేక చొరవతో విజయనగరం నుంచి చీపురుపల్లికి కేటాయించిన ప్రత్యేక బస్సు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 21న నాగళ్ళవలస గ్రామంలో గ్రామ సచివాలయ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రిని, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ని కోరిన నేపథ్యంలో మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని బస్సును నడిపేలా ఆర్టీసీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఆయన వినతి మేరకు ఆర్టీసీ సంస్థ ముందుకొచ్చి తోండ్రంగి టు విజయనగరం వయా గుజ్జంగివలస, నాగళ్లవలస, తోండ్రంగి గ్రామాల మీదుగా చీపురుపల్లికి ఆర్టీసీ బస్సు సర్వీసును నడిపేందుకు ముందుకొచ్చింది. సంబంధిత బస్సు సర్వీసును గుర్ల మండలం నాగళ్లవలస వేదికగా మంత్రి బొత్స సత్యానారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావులు రిబ్బన్ కట్ చేసి శుక్రవారం అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిపై గుజ్జంగివలస, నాగళ్లవలస, తోండ్రంగి తదితర గ్రామాల ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత బస్సు సర్వీసులు విజయనగరం నుంచి చీపురుపల్లికి ఉదయం, సాయంత్రం రెండు పూటలా అందుబాటులోకి వస్తాయని జిల్లా ప్రజారవాణా అధికారి శ్రీనివాసరావు తెలిపారు. నాగళ్లవలస వేదికగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆర్టీసి జోనల్ చైర్మన్ జి. బంగారమ్మా, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, స్థానిక గ్రామ ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.