నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సామగ్రి అందుబాటులో ఉన్నందున, ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉన్నందున ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా పేర్కొన్నారు. శనివారం హౌసింగ్ డే సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా.. కాకినాడ డివిజన్‌లోని సామర్లకోట ఈటీసీ లేఅవుట్‌ను, పెద్దాపురం డివిజన్ సూరంపాలెం రోడ్డులోని అర్బన్ లేఅవుట్‌ను పరిశీలించారు. ఇప్పటికే పూర్తయిన ఇళ్లతో పాటు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ఇళ్లను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. లేఅవుట్‌లలో కల్పించిన మౌలిక వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడారు. ఉచితంగా ఇసుక, రాయితీపై స్టీలు, సిమెంటు అందుబాటులో ఉన్నాయని అందువల్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వమిచ్చే రూ. 1.80 లక్షలకు అదనంగా రూ. 35 వేలు రుణాన్ని డ్వాక్రా మహిళలకు అందించడం జరుగుతోందని తెలిపారు. అందువల్ల ఇంకా నిర్మాణాలను ప్రారంభించని వారు వెంటనే ప్రారంభించాలని సూచించారు.
ఎవరికి ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు కరెంటు, నీటి సరఫరా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. డిసెంబర్-ఏప్రిల్ వరకు వాతావరణం అనుకూలం ఉంటుంది కాబట్టి నిర్మాణాలను త్వరిగతిన పూర్తిచేయాలని సూచించారు. ఇంకా అవసరం మేరకు అప్రోచ్ రహదారులను ఏర్పాటుచేయాలని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులకు సూచించారు. ఇంకా ఎవరికైనా రూ. 35 వేలు రుణం అందకుంటే వెంటనే బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి.. సంబంధిత దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ బి.సుధాకర్ పట్నాయక్, కాకినాడ ఆర్‌డీవో బీవీ రమణ, పెద్దాపురం ఆర్‌డీవో జె.సీతారామారావు, హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు, మెప్మా, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులు ఉన్నారు.