విజయనగరం జిల్లాలో ఈ నెల 21న సామూహిక గృహప్రవేశాలను నిర్వహించేందుకు ఇళ్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని, గృహనిర్మాణ శాఖాధికారులను జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ఆమె మంగళవారం గంట్యడ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా తాశిల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా గృహనిర్మాణ కార్యక్రమంపై సమీక్షిస్తూ, శ్లాబ్ పూర్తయిన ఇళ్లనన్నటినీ ఈనెల 21నాటికి గృహప్రవేశాలకు సిద్దం చేయాలని ఆదేశించారు. మండలంలో సుమారు వెయ్యి ఇళ్లలో గృహప్రవేశాలు నిర్వహించాలని సూచించారు. ఇప్పటికీ మొదలుపెట్టని ఇళ్లను, తక్షణమే నిర్మాణాన్ని ప్రారంభించి, ఈ నెలాఖరునాటికి పునాదులను పూర్తి చేయాలని ఆదేశించారు. వలంటీర్ల ద్వారా లబ్దిదారులను చైతన్యపరచాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా గృహనిర్మాణ శాఖాధికారి ఎన్‌వి రమణమూర్తి, తాశిల్దార్ శ్రవణ్‌కుమార్, ఇన్‌ఛార్జి ఎంపిడిఓ భానూజీరావు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.
రైతులను అప్రమత్తం చేయాలి
మరో రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, రైతులు నష్టపోకుండా అప్రమత్తం చేయాలని మండల వ్యవసాయాధికారులకు కలెక్టర్ సూచించారు. వర్షాల ముప్పు పూర్తిగా తొలగిపోయేవరకు, వరి నూర్పుళ్లు చేయకుండా రైతులను హెచ్చరించాలని కోరారు. మండలంలోని రబీ పంటల స్థితిగతులు, వరి కోతలు, ధాన్యం కొనుగోలు పరిస్థితిపై సమీక్షించారు. ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వరికోతలు మొదలైన చోట్ల వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరవాలని ఆదేశించారు. ఒకేసారి గ్రామమంతా కోతలు జరగకుండా, దశలవారీగా నిర్వహిస్తే, కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు ఉండవని సూచించారు. రెండో పంటగా అపరాలు లేదా మినప, పెసర పంటలను వేసేలా రైతులను చైతన్యపరచాలని చెప్పారు. మండలంలో సీడ్ విలేజ్‌లను ఏర్పాటు చేసి, విత్తనాలను సొంతంగా ఉత్పత్తి చేయాలని కలెక్టర్ సూచించారు. మండల వ్యవసాయాధికారి శ్యామ్‌కుమార్, సిఎస్‌డిటి ఇందిర సమావేశంలో ఉన్నారు.
అర్హులందరికీ ఓటు హక్కు
అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ఓటుహక్కు కల్పించాలని, బూత్ స్థాయి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఓటుహక్కు నమోదుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. మండలంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను, ఎంఎల్‌సి ఓటర్ల నమోదును పరిశీలించారు. ఎమ్మెల్సీ ఓట్లకు దరఖాస్తు చేసుకున్న వారితో మాట్లాడారు. బిఎల్వోలతో మాట్లాడి, ఓటర్ల నమోదు, ఇతర అంశాలపై ఆరా తీశారు. 17 ఏళ్లవారితో కూడాఓటు కోసం దరఖాస్తు చేయించాలని సూచించారు. అనర్హులను తొలగించి, ఖచ్చితమైన ఓటర్ల జాబితాను తయారు చేయాలని, ఇందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. సమావేశంలో తాశిల్దార్ శ్రవణ్‌కుమార్, డిటి సంతోష్, బిఎల్ఓలు ఉన్నారు.
విద్యార్థులను అభినందించిన కలెక్టర్
నిర్మాణాత్మక మూల్యాంకణ పరీక్షల్లో (ఎఫ్ఏ 1) అత్యుత్తమ ప్రతిభ చూపిన గంట్యాడ జెడ్‌పి హైస్కూలు విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. ఈ పరీక్షల్లో తరగతుల వారీగా అత్యధిక మార్కులను పొందిన విద్యార్థులతో ఆమె మచ్చటించారు. వారి లక్ష్యాలను తెలుసుకున్నారు. భావ ప్రకటనా సామర్ధ్యాన్ని, ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పరిశీలించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అమలు చేస్తున్న మెనూపై ఆరా తీశారు. డిక్షనరీ వినియోగంపై విద్యార్థుల అవగాహనను పరిశీలించారు. విద్యార్థులంతా కష్టపడి బాగా చదువుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఝాన్సీ, పిడి సన్యాసినాయుడు ఉన్నారు.