ప్రభుత్వ మెనూ ప్రకారం పాఠశాలల్లో విద్యార్ధినీ, విద్యార్ధులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ సిహెచ్.విజయ ప్రతాప్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లాలో పర్యటన సందర్భంగా బుధవారం ఈ మేరకు కరపమండలంలోని పెనుగుదురు 1వ నెంబరు జిల్లా పరిషత్ హైస్కూలు, కరప మోడల్ ప్రైమరీ స్కూల్, జిల్లాపరిషత్ గురాజనపల్లి పాఠశాలల్లోని భోజన, వసతిని ఆయన పరిశీలించారు. అక్కడ పిల్లలకు అందుతున్న భోజనాన్ని రుచి చూశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్నాన భోజన పథకాన్ని ప్రవేశ పెడుతోందని.. దానిని
ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిర్వహించాలని సూచించారు. ఎప్పుడైనా భోజనం బాగలేకపోయినా..సరుకులు నాణ్యత తగ్గినా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ తో పాటు ఇంచార్జి డీఈఓ, ఆర్జేడి రాజు, కాకినాడ అర్బన్ డీఐ వాణి కుమారి ఎండీఎం డేటా అనాలిసిస్ట్ ఎం. వీరబాబు, ఎండీఎం కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ హరికృష్ణ, కరప ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.