రైతులు మద్దతు ధరకే ధాన్యం విక్రయించాలి


Ens Balu
17
Garugubilli
2022-12-07 12:35:31

మద్దతు ధరకు ధాన్యం విక్రయించాలని జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ రైతులను కోరారు. గరుగుబిల్లి  మండలం చినగొడబలో జాయింట్ కలెక్టర్ బుధ వారం పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. తేమ, నాణ్యత కొలిచే యంత్రాల పనితీరును పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బందికి వివరాలు అడిగి  తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో ధాన్యం కొనుగోలు సాఫీగా జరుగుటకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ధాన్యం కొనుగోలుపై రైతులు పూర్తి అవగాహన పొందాలని కోరారు. మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించ వద్దని పిలుపునిచ్చారు.  ప్రభుత్వము ద్వారా కొనుగోలు చేసిన ధాన్యము నింపడానికి రైతులే గోనె సంచులను ఏర్పాటు చేసుకుంటే, ప్రతి 40 కిలోల సామర్థ్యం గల గోనె సంచికి రూ.3.39 లు చెల్లించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అన్నారు.

రైతులకు ధాన్యం రవాణా ఖర్చులు
రైతులకు ధాన్యం రవాణా ఖర్చులు చెల్లించుటకు నిర్ణయించినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. ధాన్యం రవాణా అంశాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించామని, అయితే రైతుల ధాన్యం కొనుగోలు నిబంధనలకు అనుగుణముగా  కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన తరువాత రైస్ మిల్లులకు తరలించడానికి అయ్యే రవాణా చార్జీలు రైతులు భరిస్తే దానిని చెల్లిస్తామని ఆయన వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను రైతులకు ఇస్తామన్నారు. పార్వతీపురం డివిజన్ లో 8 కిలో మీటర్ల వరకు ఒక మెట్రిక్ టన్నుకు రూ. 295 లు, పాలకొండ  డివిజన్ లో మూడు వందల రూపాయలు స్లాబ్ ధర చెల్లించడం జరుగుతుందని ఆయన అన్నారు. 8 నుండి 20 కిలో మీటర్లు వరకు ప్రతి అదనపు కిలోమీటరుకు ఒక మెట్రిక్ టన్నుకు 7 రూపాయలు,   20 నుండి 40 కిలో మీటర్ల వరకు ప్రతి అదనపు కిలోమీటరుకు మెట్రిక్ టన్నుకు 6.50 రూపాయలు, 40 నుండి 80 కిలో మీటర్లు వరకు ప్రతి అదనపు కిలోమీటరుకు మెట్రిక్ టన్నుకు 6 రూపాయలు,  80 కిలో మీటర్లు పైబడి ప్రతి అదనపు కిలోమీటరుకు మెట్రిక్ టన్నుకు 5.50 రూపాయలు చెల్లించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు