మాండూస్ తుపాన్ ప్రభావం వల్ల కురిసిన వర్షాలకు రైతాంగం పండించిన ధాన్యం తడిసిన మూలంగా ఎవరూ ఆందోళన చెందవద్దని రైతు పండించిన చిట్ట చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వపరంగా కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మంగళవారం జనుపల్లి గ్రామంలో రైతుల కళ్లల్లో రోడ్లపైన ఆరబెట్టుకున్న ధాన్యo రాశులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ మాండోస్ తుఫాన్ ప్రభావంతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకుని కనీస మద్దతు ధరకు విక్రయించుకునే విధంగా సౌకర్యవంతం చేయడం జరుగుతుందని ఆందోళన
చెందవద్దని తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ తడిచిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామన్నారు. పంట మార్పిడిలో భాగంగా వరికి ప్రత్యామ్నాయంగా తుఫాను ప్రకృతి వైపరీత్యాలను అధిగమించే ఇతర పంటలపై కూడా కోనసీమ రైతాంగం దృష్టి సారించాలని పేర్కొన్నారు.
పంట పొలాల్లో పనల రూపంలో పంటతో పాటు కల్లాల్లో ఉన్న ధాన్యం రాశుల స్థితిగతులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీ లించి సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దని, వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ధాన్యం స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీ లించి అన్నదాతలలో ధైర్యాన్ని నింపుతున్నామన్నారు. అనంతరం కామనగరువు లో వెంకట సత్యనా రాయణ ట్రేడర్స్ రైస్ మిల్లును ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ శాతం కొంచెం అటు ఇటుగా ఉన్న మిల్లర్లు రైతాంగాన్ని ఇబ్బంది పెట్టవద్దని మిల్లర్లకు సూచించారు. ఆరుగాలం శ్రమించి ప్రజానీకానికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాతల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని మానవ దృక్పథంతో గిట్టుబాటు ధరలు కల్పించడంలో మిల్లర్లు తమ వంతు సహకారం అందించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వసంతరాయుడు స్థానిక తాసిల్దార్ పి శ్రీ పల్లవి, గ్రామ సచివాలయ సిబ్బంది సర్పంచ్ నక్కా అరుణకుమారి ,రైతులు పాల్గొన్నారు.