కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో కొత్తగా మంజూరైన 1531 పింఛన్లను జనవరి నెల నుంచి పంపిణీ చేయనున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ కే.రమేష్ చెప్పారు. గురువారం ఆయన కాకినాడ సీతారామనగర్, శెట్టిబలిజ రామాలయ ప్రాంతం, కృష్ణానగర్ బ్యాంక్ కాలనీ ప్రాంతాల్లో కొత్తగా మంజూరైన పింఛన్లను కమిషనర్ రమేష్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆయా ప్రాంతాల్లోని కొత్త పింఛన్‌దారులతో మాట్లాడారు. పింఛన్ల మంజూరుకు సంబంధించిన విధి విధానాలు ఇతర అంశాలపై సిబ్బందితో మాట్లాడారు. ప్రస్తుతం కాకినాడలో సుమారు 30వేల పింఛన్లను అందిస్తున్నామన్నారు. తాజాగా 1531 కొత్త పింఛన్లు కూడా మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ జనవరి నెల ఒకటో తేదీన పాత పింఛన్లతో పాటు పంపిణీ చేస్తామన్నారు. అలాగే, ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ల సొమ్మును రూ. 2500 నుంచి రూ. 2750కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొందన్నారు. పెరిగిన పింఛన్ల మొత్తాన్ని కూడా వచ్చే నెల నుంచి అందజేసేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట టీపీఆర్‌వో మానే కృష్ణమోహన్, ఆయా డివిజన్ల సంక్షేమ కార్యదర్శులు ఉన్నారు.