మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం నగర పాలక సంస్థ ఎన్ని చర్యలు తీసుకొంటున్నా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మార్పు రావడం లేదని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగ నర్సింహరావు పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని 11వ డివిజన్ పరిధిలోని డెయిరీ ఫారం సెంటర్, రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంటింటికీ చెత్త సేకరణ నుంచి తడి–పొడి చెత్తను వేరు చేసే విధానం సక్రమంగా అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆ ప్రాంత ప్రజల్లో సరైన అవగాహన కొరవడిందన్నారు. చెత్తను కూడా పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వకుండా డ్రైనేజీల్లో వేయడాన్ని గుర్తించారు. చాలా మంది ప్రజలు ఇదే పద్ధతి కొనసాగిస్తున్నారని అక్కడ విధి నిర్వహణలో ఉన్న శానిటరీ ఇన్‌స్పెక్టర్, సచివాలయ కార్యదర్శి ఏమాత్రం పట్టించుకొంటున్న దాఖలాలు కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
ఇదే ప్రాంతానికి చెందిన శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు గతంలో షోకాజ్ నోటీసు ఇచ్చామనీ, శానిటరీ సెక్రటరీని సస్పెండ్ చేశామని ఏడీసీ చెప్పారు. అయినప్పటికీ వీరిలో మార్పు కనిపించడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే వీరి నిర్లక్ష్యాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలు కూడా సహకరించకపోతే పారిశుద్ధ్యం క్షీణించి దోమలు పెరిగి జ్వరాలు వచ్చి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందన్నారు. ఆయన వెంట శానిటరీ ఇన్‌స్పెక్టర్ సుదర్శన్, సచివాలయ కార్యదర్శులు ఉన్నారు.