రాష్ట్రంలో జనరంజకంగా సంక్షేమ పథకాల అమలు


Ens Balu
21
Narasannapeta
2022-12-15 11:39:45

సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జనరంజకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, నరసన్నపేట శాసనసభ్యులుధర్మాన కృష్ణ దాస్ పేర్కొన్నారు. గురువారం సారవకోట మండలం అలుదు పంచాయితీ మాకివలస సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని వివరించారు. సంక్షేమ బావుటా బుక్లెట్ పంపిణీ చేశారు. స్థానిక సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం అదే గ్రామంలోని పిల్లల శిమ్మయ్య  తాను పక్షవాతంతో బాధపడుతున్నానని కిడ్నీ వ్యాధితో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, తక్షణమే స్పందిస్తూ తగు వైద్యం అందేదిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనరంజకమైన సంక్షేమ పాలన అందిస్తున్న జగనన్నను ప్రజలు ఇప్పటికే ఆదరిస్తున్నారని స్పష్టం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలలో ఇప్పటికే  95 శాతం పకడ్బందీగా అమలుచేసిన ఘనత జగనన్నకే దక్కుతుందని తెలిపారు. జనవరి నుంచి సామాజిక పింఛన్ ను రూ.2,750కి పెంచుతున్నట్లు వెల్లడించారు. గతంలో ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి చెప్పుకునేవారని, ఇప్పుడే తామే జనం ఇంటి ముంగిటకు వెళుతున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో ధర్మాన పద్మప్రియ, వరుదు వంశీకృష్ణ, నక్క తులసీదాస్, ఎంపిడిఓ విశ్వేశ్వరరావు, తహశీల్దార్ ప్రవల్లికా ప్రియ, ఇతర అధికారులు, సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు