ఇంత మంచి కళాకృతులను తయారు చేసి ప్రదర్శించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. శనివారం భీమవరం పట్టణంలో చింతలపాటి బాపిరాజు ఉన్నత పాఠశాలలో పశ్చిమగోదావరి జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో టిఎల్ఎం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి
ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 19 మండలాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పార్ట్ టైం ఉపాధ్యాయులు, ఆయా పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు తయారుచేసిన సుమారు 600 వివిధ రకాల కళాకృతులను ప్రదర్శించడం అభినందనియం అన్నారు. వీటిని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తిలకించి వారిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరెన్నో కళాకృతులను విద్యార్థుల చేత తయారు చేయించాలని కలెక్టర్ తెలిపారు.
ఈ స్టార్స్ లో ఏర్పాటుచేసిన విభిన్నమైన కళాకృతులు జిల్లా కలెక్టర్ ను ప్రత్యేకంగా ఆకర్షించాయి. వీరు కాగితాలతో తయారుచేసిన డైనోసార్, ప్లాస్టిక్ లేకుండా తయారు చేసిన వివిధ రకాల పువ్వులు, దారాలతో చేసిన బొమ్మలు ,అలాగే ఇంట్లో వినియోగించే గృహపకరణాలు ఆకర్షణీయంగా నిలిచాయి. పాలకోడేరు చెందిన కె.అంబిక ఉపాధ్యాయురాలు పెయింట్ తో గీసిన జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి కుటుంబ సభ్యుల చిత్రపటాన్ని కలెక్టర్ కు బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్. వెంకటరమణ, సమగ్ర శిక్ష ఏపీసీ పీ .శ్యాంసుందర్, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాధినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.