వాకపాడు ప్రయాణమా...ఆమ్మో జాగ్రత్త సుమా..


Ens Balu
2
వాకపాడు
2020-09-23 16:33:44

ఆ గ్రామానికి చేరుకోగానే వాహనచోదకుల గుండెళ్లో రైళ్లు పరిగెడతాయి...ఒకటి కాదు రెండు కాదు...పది రోజుల వ్యవధిలో 15 ద్విచక్రవాహనాలు ఆ ప్రాంతంలో ప్రమా దాలకు గురయ్యాయి. సుమారు 20 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదాలకు నిలయమైన ఆ ప్రాంతం కోసం తెలుసుకుంటే ఎస్.రాయవరం మండ లంలో, ఎస్.రాయవరం నుంచి వాకపాడు వెళ్లే దారిలోని ఆర్అండ్ బి కి చెందిన తారురోడ్డు పూర్తిగా శిథిలమైంది. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లిన ద్వికచక్రవాహదారులు బురదమయంగా మరిన రోడ్డులో బోల్తా కొడుతున్నారు. నాలుగు రోజులు క్రితం బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వెళుతూ ఈ గుంతమయమైన బురద రోడ్డుపై పడి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని వాకపాడు గ్రామసచివాలయ కార్యదర్శి ఎస్.కుమార పట్నాయక్ కి విన్నవిస్తే...తామేమీ చేయలేమని, ఈ రోడ్డు ఆర్ అండ్ బి చెందినదని చేతులెత్తేశారు. పైగా ఈ గ్రామాన్ని సందర్శించిన నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య రోడ్డు దుస్థితి చూసి తక్షణమే ఈరోడ్డు పనులు చేయాలని అధికారులను ఆదేశించడంతో సబ్ కలెక్టర్ నుంచి తప్పించుకోవడానికి ఈ గుంతలమయం అయిన రోడ్డులో మట్టివేయించి చేతులు దులుపుకున్నారు. ఆతరువాత కురిసిన భారీ వర్షాలకు ఈ రోడ్డు మరింత దారుణంగా తయారై ప్రమాదాలు అధికం అయ్యాయి. దీనికి తోడు గ్రామంలో ఎక్కడా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఎప్పుడు వర్షం పడినా మురుగునీరు మొత్తం ఈ పాడైన రోడ్డుకి చేరిపోవడంతో రోడ్డు మరింత దారుణంగా పాడైపోయింది. ఎనిసార్లు ఫిర్యాదులు చేసినా ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోగా, రోడ్డు బాగాలేని సమయంలో జాగ్రత్తగా వెళ్లాలని సలహా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామసచివాలయం, ఆర్ అండ్ బి రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో గ్రామస్తులతోపాటు, ఈ ప్రాంతం మీదుగా ప్రయాణించే వాహచోదకులు వరుస ప్రమాదాలతో నరకం చవి చూస్తున్నారు.