రాష్ట్రంలో రైతాంగానికి భూ రక్షణ భరోసాను కల్పిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినదే 'వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం' అని పార్లమెంటరీ చీఫ్ విప్, మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. శనివారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలోని బొమ్మూరు సచివాలయం-1 ప్రాంగణంలో ' జగనన్న భూ హక్కు పత్రాలను' ఎంపీ భరత్, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ, సుమారు వంద సంవత్సరాల తరువాత గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వ్యవసాయ గ్రామ కంఠం స్థిరాస్తుల సర్వేను సీఎం జగన్ ఒక మహాయజ్ఞంలా నిర్వహించడం ఎంతో గొప్ప విషయమన్నారు. దళారీ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ, పారదర్శకంగా నిష్పక్షపాతంగా అవినీతికి తావులేని రీతిలో ఈ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్నారు.
దేశంలోనే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలోనే డ్రోన్ టెక్నాలజీ వినియోగంతో అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను సచ్ఛీకరణ, వాస్తవంగా ఉన్న భూమి విస్తీర్ణం ప్రకారం రికార్డుల తయారు చేయడం జరుగుతోందన్నారు. ఈ పథకంతో భూ యజమానులు తమ భూములపై వేరొకరు సవాల్ చేయడానికి వీలులేని శాశ్వత హామీ, భూ వివాదాలు తగ్గుముఖం పడతాయని ఎంపీ పేర్కొన్నారు. ఈ పథకంపై రైతులకు గ్రామ సచివాలయ సిబ్బంది అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. రాజమండ్రి రూరల్ పరిధిలో ఈ కార్యక్రమం రాజవోలు జరిగిందని, ఇప్పుడు బొమ్మూరులో రైతులకు భూహక్కు పత్రాల పంపిణీ జరుగుతోందన్నారు. బొమ్మూరు గ్రామంలో 178 మంది రైతులకు ఈ భూహక్కు పత్రాలు పంపిణీ చేయబోతున్నట్లు ఎంపీ భరత్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ. చైత్రవర్షిణి, తహసీల్దారు చిన్నారావు, ఎంపీడీవో రత్నకుమారి, గ్రామ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, వైసీపీ నేతలు సోమన శ్రీను, అను, రాజేష్, రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.