సింహాచలంలోని శ్రీ వరహాలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలోజనవరి 2న నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి ( ముక్కోటి) పర్వదినం సందర్భంగా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంఛార్జి ఈవో వి.త్రినాథ్ రావు ఆధ్వర్యంలో వైదిక సిబ్బంది సూచనల మేరకు ఆలయ ఇంజనీరింగ్ అధికారులు ఈ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సుమారు 70 వేల మంది భక్తులు ఉత్తర ద్వారం లో కొలువుండే స్వామిని దర్శించుకునే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో త్రినాధరావు ఇప్పటికే అన్ని విభాగాలు అధికారులను కోరారు. ఇందుకోసం సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు.100, 300, 500 టికెట్ లు పై క్యూ లైన్ లలో భక్తులు స్వామిని సులభంగా దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులందరికీ ఉచితంగా పొంగలి, పులుసు ప్రసాదం అందజేసేందుకు ఏర్పాట్లు గావిస్తున్నారు. ఆలయాలకు అందముగా రంగులు వేసి బారీ విద్యుత్ అలంకరణలు చేస్తున్నారు . క్యూ లైన్లు,షామియానాలు ఇప్పటికే వేస్తున్నారు.
ఆలయ పురోహితులు ,అలంకార్ కరి సీతారామాచార్యులు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్ రాజు, ఏస్. శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, దేవాలయ ఇన్స్పెక్టర్ సిరిపురపు కనకరాజు తదితరులంతా బుధవారం ఆయా ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్య భక్తులు సులభంగా స్వామిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని వీరు అధికారులను కోరారు. ఆరోజు తెల్లవారుజామున 1:00కు స్వామిని సుప్రభాత సేవ తో మేలుకొలిపి,తదుపరి ఆరాధన గావిస్తారు అనంతరం 4:30 గంటలకు ఉత్తర ద్వార దర్శనంలో స్వామిని ఆసీనులను చేసి, వ్యవస్థాపక ధర్మకర్త, ధర్మకర్తల మండలి సభ్యులకు దర్శనం కల్పిస్తారు. ప్రోటోకాల్ దర్శనాలు పూర్తికాగానే ఉత్తర రాజగోపురము లో వైకుంఠ నాధుడు అలంకరణ లో ఉన్న సింహాద్రి నాధుడు ను ఆసీనులు చేసి భక్తులందరికీ స్వామి దర్శనం లభించే విధంగా అన్ని ప్రాంతాలను తీర్చిదిద్దుతున్నారు.