పార్వతీపురం మన్యంజిల్లా లోని కొమరాడ మండల ప్రజలకు గజరాజుల బాధలు మళ్లీ మొదలయ్యాయి. గత రెండు వారాలుగా అర్థం రిజర్వు ఫారెస్టును ఆనుకొని ఉన్న కుమ్మరిగుంట రహదారిపై గజరాజులు తిష్ట వేశాయి. దీనితో కుమ్మరిగుంట, రాజ్యలక్ష్మీపురం ప్రజలు రాత్రి పూట బిక్కు బిక్కు మంటూ గడపాల్సిన పరిస్థితి ఎదురైంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇక్కడి ప్రజలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ ప్రాంతంలో టమాట, జామ, బొప్పాయి వంటి వాణిజ్య పంటలను ధ్వంసం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను అడవిలోకి తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.