కాకినాడ జిల్లా శంఖవరం మండలం సిద్ధివారిపాలెం దివ్యక్షేత్రం ఆంధ్రాశబరిమలలో ఈ నెల ఆదివారం 14 భోగి పండుగ రోజున మకర జ్యోతి దర్శన భాగ్యం కలుగనుంది. సాక్షాత్తూ అయ్యప్పస్వామి ప్రతిరూపమైన మకర జ్యోతి దర్శనం భక్తులందరికీ కలుగజేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఆలయ ధర్మకర్త డా.కుసుమంచి శ్రీసత్యశ్రీనివాసరావు తెలియజేశారు. ఆ రోజు వేలాది మంది భక్త గణానికి సాక్షాత్తూ స్వామి అయ్యప్ప మూల విరాఠ్ స్వరూప ప్రతిరూప మకరజ్యోతి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆంధ్రా శబరిమలగా ప్రసిద్ధి గాంచిన ఈ అయ్యప్ప ఆలయ ప్రాంగణం పరిసరాల్లో దర్శనమిచ్చే మకర జ్యోతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయం సమీపంలోని ఎత్తైన పర్వత శ్రేణులపై రాత్రి సమయంలో అయ్యప్ప అఖండ మకర జ్యోతి దర్శన భాగ్యం వేయి జన్మల పుణ్య ఫలంగా భావిస్తారు. సరిగ్గా 12 గంటలకు స్వామికి దివ్యాభరణాలను ధరింపజేసే 'తిరువాభరణ' ఘట్టం పేరుతో ఆలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన పూల పల్లకిలో స్వామిని ఘనంగా ఊరేగిస్తారు.
ఆ సమయంలో స్వామి వారి ఆభరణాలు కాపాడటానికి ఒక గరుడ పక్షి తిరుగుతుంది. స్వామిని పలు ఆభరణాలతో అలంకరించి కర్పూర హారతి ఇచ్చే సమయంలోనే ఏటేటా ఎప్పుడూ మకర సంక్రాంతి రోజునే ప్రత్యక్షం అయ్యే అయ్యప్ప మకర జ్యోతి ఈ ఆలయానికి చుట్టూ ఉండే తూర్పు కనుమల శ్రేణిలోని తూర్పు దిశలో ఉండే పర్వతాలపై దర్శన మిస్తుంది. స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తుల నోట వెలువడిన నామ సంకీర్తనతో శబరిగిరులు ఒక్క సారిగా మార్మోగుతాయి. స్వామి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలు మూలల నుంచి మాల ధారణ చేసిన స్వాములు, సాధారణ భక్తులు, స్వామి వారి మండల పూజలు పూర్తి చేసుకున్న భక్త స్వాములు ఈ ఆంధ్రా శబరిమలకు చేరుకుంటారు. కాగా మకరజ్యోతి దర్శనం రోజు భక్తుల కోసం ఏర్పాట్లు చేసి, తీర్ధ ప్రసాద సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్టు ఆలయ గురుస్వామి డా.కుసుమంచి శ్రీసత్యశ్రీనివాసరావు తెలియజేశారు. స్వామి, మకరజ్యోతి దర్శనం చేసుకొని అయ్యప్ప కటాక్షం పొందాలని కోరారు.