విశాఖలోని సాలిగ్రామపురం సమీపంలో గల విశాఖ పోర్టు ట్రస్ట్ ఆసుపత్రి నిర్వహణ, దానికి అనుకొన్న మరో నాలుగు ఎకరాల స్థలాన్ని పిపిపి పద్దతిలో ప్రైవేటు పరం చేయాలని పోర్టు ట్రస్ట్ యాజమాన్యం నిర్ణయించడం సమంజసం కాదని ఏఐటీయూసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం జివిఎంసీ ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. కార్మికుల, ఉద్యోగుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా ఇలాంటి నిర్ణయం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి బి సిహెచ్ మసేన్ అన్నారు. ఇటీవల పలుమార్లు ఈ అంశంపై అభ్యంతరాలు తెలిపినట్టు పేర్కొన్నారు. కార్మికుల నిరసనకు టిడిపి నేత బండారు సత్యన్నారాయణ తన మద్దతు తెలియజేశారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాగే ప్రైవేటు పరం చేయాలని చూస్తే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్న అంశాన్ని గుర్తు చేశారు.