అవహేలనచేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు


Ens Balu
9
Gajuwaka
2023-01-27 12:06:48

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై  చేస్తున్న పోరాటాలను అవహేళన చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిపిఎం పాలిట బ్యూరో సభ్యులు బివి రాఘవులు హెచ్చరించారు. శుక్రవారం ఉక్కునగరం సిఐటియు కార్యాలయంలో స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి దాస్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.  ముఖ్య అతిథిగా పాల్గొన్న బివి రాఘవులు మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేకత పై పోరాడుతున్న వారిలో మత విద్వేషాలను సృష్టించడం, ఐక్యతను విఘాతం చేసే విధంగా కృషి చేయడం, ఉద్యమాలను బలహీనపరిచే విధంగా కుట్రలు కుతంత్రాలు చేయడం తద్వారా ప్రజాధనాన్ని కార్పొరేట్ శక్తులకు ధారపోయడం కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన ఆరోపించారు. 

విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం దేశ పరిశ్రమల రక్షణ ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమన్న ఆయన  ఈ స్ఫూర్తితో దేశవ్యాప్త ఉద్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ పోరాటాలతో తగిన బుద్ధి చెప్పాలని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా సిఐటియు కార్యదర్శి కె లోకనాథం మాట్లాడుతూ, రాష్ట్రంలోనే అనేకమందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం అనుసరిస్తున్న విధానాల్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఐక్యంగా ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతంగా చేయవలసిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. దీనికి ప్రధాన భూమికగా 30వ తారీకు జరుగుతున్న ప్రజాగర్జనను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

జిల్లా జేఏసీ కన్వీనర్ ఎం జగ్గు నాయుడు మాట్లాడుతూ 30వ తారీకు జరిగే ప్రజా గర్జనకు జిల్లా వ్యాప్తంగా అనేక పరిశ్రమలలో అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. దీనిపై ప్రధాన భూమిక పోషించవలసిన ఉక్కు కార్మిక వర్గం మరింత చైతన్యవంతం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా సిఐటియు అధ్యక్షులు కె ఎం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎన్ రామారావు, స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి, స్టీల్ సిఐటియు నాయకులు బి అప్పారావు, గంగాధర్, యు వెంకటేశ్వర్లు, టి వి కె రాజు, కెవి సత్యనారాయణ, మరిడయ్య, నీలకంఠం, ఓవి రావు, బి ఎన్ మధుసూదన్, కె సత్యనారాయణ, డిసిహెచ్ వెంకటేశ్వరరావు, రామచంద్ర రావు, సూర్యనారాయణ తదితరులతో పాటు వివిధ విభాగాల కార్యదర్శిలు, కార్మికులు పాల్గొన్నారు.

సిఫార్సు