ప్రణాళికా బద్ధంగా గృహనిర్మాణాలు పూర్తికావాలి


Ens Balu
8
Kakinada
2023-01-27 14:59:41

ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమంగా ఉన్న గృహనిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేకాధికారులు ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.రమేష్‌ ఆదేశించారు. కాకినాడ కార్పొరేషన్‌ కార్యాలయంలో శుక్రవారం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో జరుగుతున్న గృహనిర్మాణాలపై గృహనిర్మాణ అధికారులు, స్పెషల్‌ ఆఫీసర్లు, కాంట్రాక్టర్లతో ఏడీసీ సీహెచ్‌ నాగనరసింహరావుతో కలిసి  సమీక్షించారు. డివిజన్ల వారీగా గృహనిర్మాణ ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది అగ్రిమెంట్లు ఇచ్చారు? ఎన్ని ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి? సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? వంటి అంశాలపై  ఆయన డివిజన్ల వారీగా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్ళుతోపాటు టిడ్కోలో చేపట్టిన ఇళ్ళ నిర్మాణాలను కూడా మరింత వేగవంతం చేయాలన్నారు.

 గృహనిర్మాణ లబ్థిదారులుగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు  రూ.35వేల బ్యాంకు లింకేజీపై బ్యాంకుల నుంచి అందే సహకారం, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని కూడా ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకొస్తే  పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.  లక్ష్యాలను నిర్ధేశించుకుని ఎట్టిపరిస్థితుల్లోను వాటిని అధిగమించి వేగవంగా ఇళ్ళ నిర్మాణాలు జరిగేలా చూడాలన్నారు. అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు మాట్లాడుతూ అగ్రిమెంట్‌ ఇచ్చిన లబ్థిదారుల ఇళ్ళను మరింత వేగవంతం చేయడంతోపాటు రెండవ దశ నిర్మాణాలపై దృష్టిపెట్టాలన్నారు. గృహనిర్మాణాలకు ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉన్నందున ఇళ్ళ నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం.ఏసుబాబు, గృహనిర్మాణశాఖ డిఈ గుప్త, టీడీపీఆర్వో మానే కృష్ణమోహన్, పలువురు ప్రత్యేక అధికారులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు