విశాఖ శ్రీ శారదాపీఠంలో త్వరలో వైష్ణవ ఆగమ పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్టు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి ప్రకటించారు. ఇప్పటికే పీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల ద్వారా విద్యార్ధులకు స్మార్తంతో పాటు రుగ్వేదం, యజుర్వేదం నేర్పుతున్నామని అన్నారు. తమ గురువులు స్వరూపానందేంద్ర స్వామి సంకల్పం మేరకు త్వరలోనే వైష్ణవ ఆగమ సదస్సును ఏర్పాటు చేయదలచామని వివరించారు. ఆలయ సంస్కృతిని ద్విగుణీకృతం చేసే ఆగమాలను ప్రోత్సహించాల్సిన అవసరముందని తెలిపారు. ఆలయం ఉన్నంత వరకు ఆగమం ఉంటుందని, ఆలయం ఉంటేనే ధర్మం నిలబడుతుందని స్వాత్మానందేంద్ర స్వామి స్పష్టం చేసారు. ఆగమ, వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులతో మూడు రోజులపాటు నిర్వహించిన చాత్తాద వైష్ణవ ఆగమ సదస్సు ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సదస్సులో చిర్రావూరి శ్రీరామ శర్మ, విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు. అర్చక ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో వేదాంతం రాజగోపాల చక్రవర్తి ఈ సదస్సును నిర్వహించారు.