అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఐటీడీఏ పీఓ రోణంకి గోపాలక్రిష్ణను తక్షణమే ప్రభుత్వం సరెండర్ చేయాలని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్ధినిలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో కళాశాలల వసతి గృహాల్లో విద్యార్థిని విద్యార్థులకు నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ పాడేరు ఐటిడిఏ ముందు 43 రోజులుగా దీక్ష చేస్తున్న ఐక్య ప్రజావేదిక నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు కళాశాలల వద్ద సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ, ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థిని విద్యార్థుల మరణాలు అరికట్టి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో హెల్త్ అసిస్టెంట్లు నియమించి ఆరోగ్యాన్ని కాపాడాలని, పౌష్టికాహారం అందించాలని 43 రోజులుగా దీక్ష చేస్తున్న ఐక్యవేదిక నాయకులను భేషరతుగా విడిచి పెట్టాలన్నారు. గిరిజన వ్యతిరేకి అయిన పాడేరు ఐటీడీఏ పీఓ రోణంకి.గోపాలకృష్ణను ప్రభుత్వం సరెండర్ చేయకుండా దీక్షలు చేస్తున్న ఐక్యవేదిక నాయకులను అరెస్టులు చేయడాన్ని తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్ధినిలు పాల్గొన్నారు.