సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో విశాఖ శ్రీ శారదాపీఠం పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సోమవారం సాయంత్రం నిర్వహించిన రధోత్సవం వేడుకగా సాగింది. కోలాటం బృందాలు, తప్పెట గుళ్ళు, డప్పు వాయిద్యాలు, విచిత్ర వేష ధారణలతో వైభవోపేతంగా ఉత్సవం నిర్వహించారు. చినముషిడివాడలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు నారికేళాలను సమర్పించి రధోత్సవాన్ని ప్రారంభించారు. రధోత్సవంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. చినముషిడివాడ ప్రాంతమంతా సంచరించిన అనంతరం సుబ్రహ్మణ్య రధం తిరిగి పీఠానికి చేరుకుంటుంది. అనంతరం వల్లీ కళ్యాణం చేపడతారు. ఏటా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రోజంతా పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గిరిజనులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.