ప్రస్తుత అనారోగ్య వాతావరణం, కాలుష్యం తదితర కారణాలతో విస్తరిస్తున్న వ్యాధులలో క్యాన్సర్ ఒకటని దీనిని ప్రాథమిక దశలో గుర్తిస్తే జీవిత కాలాన్ని పెంచడంతోపాటు పూర్తిగా నయం చేయవచ్చని డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో ఐడిఏ కాకినాడ శాఖ అధ్యక్షులు డాక్టర్ వెదురుపాక సతీష్ అధ్యక్షతన జరిగిన కేన్సర్ అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. క్యాన్సర్ అంటే మన ఒంట్లో ఏదో ఒక అవయవంలో జీవకణాలు విజృంభించి అదుపు ఆజ్ఞ లేకుండా పుంకాను పుంకాలుగా పుట్టుకు వస్తూ గడ్డల్లా పెరగడం అన్నారు. స్త్రీలలో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా కనబడుతున్నాయని అన్నారు స్త్రీ పురుషులలో గొంతు, నోరు దవడలు, స్వర పేటిక క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. దీని నివారణకు గాను ఆహార నియమాలతో పాటు శారీరక వ్యాయామం అవసరమని అన్నారు. ఇది అంటువ్యాధి కాదని కొన్ని రకాల క్యాన్సర్లు వంశపారంపర్యంగా రావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సువర్ణ రాజు, అడబాల రత్న ప్రసాద్ ,రేలంగి బాపిరాజు, చింతపల్లి సుబ్బారావు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.