అంగన్ వాడీ కేంద్రాల ద్వారా, పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు బి. కాంతారావు సంబంధిత అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఎస్.కోటలో పర్యటించారు. అంగన్ వాడీ కేంద్రాలు, ఎం.ఎల్.ఎస్. పాయింట్లు, పాఠశాలలను సందర్శించారు. ఆహార సంబంధిత పథకాల అమలు తీరును పర్యవేక్షించారు. దీనిలో భాగంగా స్థానిక అంగన్ వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ హాజరు పట్టికలో దిద్దుబాట్లు ఉండటంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు.
పాఠశాలల్లో పిల్లల కోసం అందుబాటులో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ఎం.ఎల్.ఎస్. పాయింట్ల ద్వారా ఎండీయూ వాహనాలకు అందిస్తున్న రేషన్ సరకుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లో నమోదు చేయాలని చెప్పారు. పర్యటనలో భాగంగా ఆయన ఎస్. కోటలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. విద్యాభ్యాసం, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కావ్యారెడ్డి, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.