ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు చేసిన మూడున్నరేళ్ల తరువాత వాటి నుంచి పూర్తిస్థాయి ఫలితాలను ఆశించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సచివాలయాలు ఏర్పాటు చేసినపుడు ఇచ్చిన జాబ్ చార్టును తాజాగా 20విభాగాల ఉద్యోగులకు మార్పు చేసింది. వాటి ద్వారానే సిబ్బంది ఖచ్చితంగా పనిచేయాల్సి వుంటుంది. అంతేకాకుండా వారు ఏవిధంగా పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు వారి శాఖలకు చెందిన జిల్లా, డివిజన్ అధికారులను పర్యవేక్షణకు ఆకస్మికంగా పంపిస్తున్నది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారు..ప్రభుత్వం ఇచ్చిన రికార్డులు ఎలా నిర్వహిస్తున్నారు.. స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారా లేదా.. సర్వీసు రిక్వెస్టులు ఎన్నిరోజుల్లోగా క్లియర్ చేస్తున్నారు.. యూనిఫారం సక్రమంగా వేసుకొని వస్తున్నారా లేదా.. ఫేస్ బయోమెట్రిక్ ఏవిధంగా చేస్తున్నారు.. టూర్ డైరీలు ఎలా నిర్వహిస్తున్నారు.. మినిట్స్ బుక్ నిర్వహణ ఎలా చేపడుతున్నారు.. ఉద్యోగుల సెలవులు, ఓడీలు.. అసలు ఎన్నిరకాల సేవలను ప్రజలకు అందిస్తున్నారనే విషయాన్ని తెలుసుకుంటున్నది. దానికోసం ప్రతీ జిల్లా అధికారి నెలలోరెండు సార్లు సచివాలయాలను సందర్శించాల్సి వుంటుంది. ఆ సమయంలో గుర్తించిన అంశాలను జిల్లా కలెక్టర్ కు, సదరు ప్రభుత్వశాఖ ముఖ్యకార్యదర్శికి నివేదించాల్సి వుంటుంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సచివాలయాల్లో పంచాయతీరాజ్, పోలీస్, ఇంజనీరింగ్, వెల్ఫేర్, రెవిన్యూ, వ్యవసాయం, వాణిజ్యం, పట్టుపురుగులు, పశుసంరక్షణ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, విద్యుత్ ఇలా 20 ప్రభుత్వశాఖల సిబ్బంది పనిచేస్తున్నారు. వారందరి జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులు ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా సందర్శించాల్సి వుంటుంది. వారితోపాటు, ఎమ్మెల్యే, ఎంపీ, నగర మేయర్లు, నగర పంచాయతీ అధికారులు కూడా సచివాలయాలను సందర్శించాల్సి వుంటుంది. తద్వారా క్షేత్రస్థాయిలో ఇబ్బందులను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, సిబ్బంది సేవలను మెరుగు పరచడానికి కూడా అవకాశం వుంటుందనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ నిర్ణయం మేరకు అధికారులు సచివాలయాల సందర్శన కూడా చేపడుతున్నారు. దీనితో సచివాలయ సిబ్బంది..మొన్నటి వరకూ ఆడుతూ పాడుతూ పనిచేసేవారు కాస్తా..దారిలోకి వచ్చి ఎప్పటి రికార్డులను అప్పుడు పూర్తిచేయడం ప్రారంభిస్తున్నారు. లేదంటే అప్పటి పరిస్థితిని బట్టీ సదరుశాఖ జిల్లా/డివిజన్ స్థాయి అధికారి రికార్డుల్లో ఎరుపురంగు పెన్నుతో సంతకాలు చేసి వెళతారు. అదే సమయంలో అప్పటికి సచివాలయంలో సేవలు వినియోగించుకోవడానికి వచ్చిన ప్రజల నుంచి కూడా వాంగ్మూలం తీసుకుని..ఆపై చర్యలకు ఉపక్రమిస్తారు.
ప్రభుత్వం వేసిన ముందడుగులో ఫలితాలు, చర్యలు కూడా ప్రారంభం అయ్యాయి. విధినిర్వహణలో అలసత్వం వహించేవారిని ఇంటికి పంపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం సచివాలయ సిబ్బందికి ఇచ్చిన యూనిఫారం వేసుకురాని సిబ్బందికి నేరుగా జిల్లా కలెక్టర్లు షోకాజ్ నోటీసులు జారీచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఈ విషయం తెలిసినా ఎంపీడీఓలు పెద్దగా పట్టించుకోకపోవడం, సచివాలయ కార్యదర్శిలే యూనిఫాం వేసుకురాకపోయినా ఏమీ అనకపోవడం వంటి విషయాలను ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది. ఈవిషయంలో ఎవరికీ మినిహాయింపులు ఇవ్వలేదని ప్రకటించినా..చాలా మంది సిబ్బందిలో మార్పురాలేదు..కనీసం మండల అధికారులు పెట్టే సమావేశాలకు సైతం సచివాలయ సిబ్బంది యూనిఫాంలో కాకుండా సాధారణ దుస్తుల్లో వెళుతున్నా ఎంపీడీఓలు పట్టించుకోవడం లేదు. ఇకపై అలాంటి అంశాలను కూడా ఆకస్మిక తనిఖీలకు వచ్చే అధికారులు గుర్తించి విషయాన్ని జిల్లాస్థాయిలో కలెక్టర్, జెసిలకు, రాష్ట్రస్థాయిలో వారి శాఖల ముఖ్యకార్యదర్శి దృష్టికి తీసుకెళతారు. ఇప్పటివరకూ ఏదోలాగడిచిపోయిన సచివాలయ సిబ్బంది విధినిర్వహణ ఇకపై కష్టతరంగానే మారిందనడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రయోజనకర నిర్ణయాలే కారణంగా కనిపిస్తున్నాయి. తమపని తాము చేసుకుపోయే సిబ్బంది ప్రభుత్వ విధానాన్ని స్వీకరిస్తుంటే.. ఏవో సాకులు చెప్పి విధులకు డుమ్మాకొట్టి, వారికి నచ్చినట్టుగా పనిచేసే సిబ్బందికి మాత్రం ప్రభుత్వ చర్యలు యమపాశంలా కనిపిస్తున్నాయి. చూడాలి ప్రభుత్వ నిర్ణయం, కొత్త జాబ్ చార్టు అమలు ఏ తరహా ఫలితాలు ముందు ముందు తీసుకువస్తుందనేది..!