జనసేనఅధినేత పవన్ కళ్యాణ్ టిడిపి సీనియర్ కార్యకర్త


Ens Balu
13
Pendurthi
2023-02-04 10:29:01

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త అని, యువగళం పేరుతో చంద్రబాబు సొంత కొడుకు రోడ్డు ఎక్కితే.. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పార్టీ జెండాలు మోస్తూ వెట్టిచాకిరి చేస్తున్నాడని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. పెందుర్తి నియోజకవర్గంలో కోటి 60 లక్షల రూపాయలతో నిర్మించిన కాపు సామాజిక భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయంగా, ఆర్థికంగా కాపు సామాజిక వర్గానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చిందని అన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తరఫున 31 మంది కాపు అభ్యర్థులు పోటీ చేస్తే 27 మంది గెలిచారని ఆయన చెప్పారు. రాష్ట్ర క్యాబినెట్లో 25 మంత్రులు ఉంటే అందులో ఐదుగురు మంత్రులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని ఆయన పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యతను మరువరాదని మంత్రి అమర్నాథ్ అన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టొచ్చు.. పార్టీని స్థాపించిన వారు దానిని సుదీర్ఘకాలం నడపాలనుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ.. వేరే వాళ్ల కోసం నడుపుతున్నాడు" అని అమర్నాథ్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి 2011లో పార్టీ స్థాపించారని, 2019లో అధికారంలోకి వచ్చారని పార్టీ పెట్టిన తర్వాత ఎనిమిదేళ్లపాటు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని, పోరాటాలు సాగించి ప్రజా బలంతో అధికారంలోకి వచ్చారని అన్నారు. అదే పవన్ కళ్యాణ్ కు పార్టీని నడిపే శక్తి, తపన లేదని కాపులందరినీ తీసుకువెళ్లి తాకట్టు పెట్టాలనుకుంటున్నాడని అందుకు తాము సిద్ధంగా లేమని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.
 సినిమాలలో అంతో ఇంతో సంపాదించిన పవన్ కళ్యాణ్ కాపులకు ఏంచేశారని ఆయన ప్రశ్నించారు. అటువంటి అప్పుడు కాపులు ఆయనకు ఎందుకు ఓటేయాలని అమర్నాథ్ ప్రశ్నించారు. 175 స్థానాలకు పోటీ చేయలేని పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో? అని  ప్రశ్నించారు.

 ఈ అంశాలపై చర్చ జరగాలని కాపులంతా రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలను నిశితంగా పరిశీలించాలని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేసినా వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని తమ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తున్నది అమర్నాథ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడి సీనియర్ నేతలను కలుస్తున్న విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు అమర్నాథ్ సమాధానం చెబుతూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు.. దీనిని రాజకీయ అలజడి కింద చూడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండదని, నోటా కి వచ్చే ఓట్లు కన్నా తక్కువే వస్తాయి అని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో వైసిపి ట్రెండ్.. 2024 లో కూడా కొనసాగుతుందని అమర్నాథ్ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.
సిఫార్సు